గ్రంథాలయ గాంధీ వెంకటప్పయ్య అస్తమయం

గ్రంథాలయోద్యమ పితామహు డు, గ్రంథాలయ గాంధీ బిరుదాంకితుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య(83) అస్తమించారు. గుం టూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వెంకటప్పయ్యకు ఆదివారం రాత్రి  గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందారు. వెంకటప్పయ్య 1932లో తెనాలి ఐతానగర్‌లో రైతు కుటుం బంలో జన్మించారు.

హైస్కూల్ చదువుతోనే తృప్తిపడి, 1956లో రేపల్లె శాఖాగ్రంథాలయంలో గ్రంథ పాలకునిగా చేరారు. ఆ తర్వాత చదువును కొనసాగించారు. 1962లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రంథాలయశాస్త్రంలో డిప్లొమా, 1971లోఎం.ఎ, 1981లో ఏయూ నుంచి పీహెచ్‌డీ పొందారు. 2013లో ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రం గాల ప్రముఖులకు అందజేసిన ఉగాది పురస్కారాన్ని గ్రంథాలయ రంగం నుంచి డాక్టర్ వెలగా ఒక్కరికే ప్రదానం చేయడం విశేషం.

సాధారణ లైబ్రేరియన్‌గా జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎన్నో గౌరవాలు, పురస్కారాలను అందుకున్నారు. 1990లో ఉద్యో గ విరమణ అనంతరం రచనా వ్యాసంగలోనే నిమగ్నమయ్యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘంటువులు, తెలుగు ప్రముఖులు, బాలసాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. నమూనా పౌర గ్రంథాలయ చట్టం రూప కల్పన, గ్రంథాలయాల గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీ, పుస్తక ప్రచురణ, బాలసాహిత్య రచనలో కృషి చేశారు.

మూలం: సాక్షి