అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయోద్యమ సారధి, తన జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన వెలగా వెంకటప్పయ్య సోమవారం నాడు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. వెంకటప్పయ్య స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. శాఖ గ్రంథాలయంలో చిన్న ఉద్యోగిగా చేరిన ఆయన తెలుగునాట గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచారు. బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందారు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశారు. మరుగున పడిన రచనలు, ముఖ్యంగా బాల సాహిత్యంలో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందుపరిచారు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంధాలయ విజ్ఞానానికి సంబంధించి ఆయన రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. ఆయన రాసిన పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాల గౌరవాన్ని పొందాయి. వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు.
మూలం: తెలుగువన్