Category: Uncategorized
వెలగా వెంకటప్పయ్య సేవలు వెలకట్టలేనివి
డాక్టర్ వెలగా రెండవ వర్థంతి సభలు తెనాలి గుంటూరులో
గ్రంథాలయ ఉద్యమానికి వెలగా వెంకటప్పయ్య సేవలు ఎనలేనివి
సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని, యువత చెడుమార్గంలో పయనించకుండా ఉండేందుకు పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. స్థానిక వైఎంహెచ్ఎ హాలు వద్ద బాలల గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ సారథి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెలగా వెంకటప్పయ్య నలుగురికి విజ్ఞానాన్ని పంచి ఎందరికో మార్గదర్శకులయ్యారన్నారు. సామాజిక సేవ, త్యాగం ద్వారా ఏదైనా సాధించవచ్చని గాంధీజీ బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయంటే ఇతరులకు చెప్పే ముందు గాంధీజీ ఆచరించి చూపారన్నారు. వెంకటప్పయ్య కష్టపడి పనిచేసి గ్రంథాలయ సంస్థకే వన్నె తీసుకువచ్చారని, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సహనం, ఓపికతో ఆలోచన విధానాన్ని పెంచుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీఆర్‌రెడ్డి కళాశాల లైబ్రేరియన్ ఎల్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటప్పయ్య గ్రంథాలయ ఉద్యమానికి నిరంతరం కష్టపడి పనిచేశారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక చింతనతో పాటు పుస్తకపఠనం కూడా ప్రశాంతతకు మార్గం చూపుతుందన్నారు. అభివృద్ధి సాధించడానికి చదువుపై సంకల్పం దీక్ష తప్పనిసరి అన్నారు. తాను చదువుకుంటున్న రోజుల్లో విద్యకే ప్రాధాన్యం ఇచ్చి ఎంతో కష్టించి చదువుకున్నానని, అందుకే ఈరోజు కమిషనర్ స్థాయికి ఎదిగానన్నారు. డెప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిశోర్, లైబ్రేరియన్ ఉదయశంకర్, చెన్నా వెంకట్రామయ్య పాల్గొన్నారు.
మూలం:వెబ్ ఏలూరు.కామ్
కృషి రూపెత్తిన రుషి డాక్టరు వెలగా వెంకటప్పయ్య
బాపు గీసిచ్చిన రేఖాచిత్రాలు
వెలగా వెంకటప్పయ్య గారి జ్ఞాపకార్థం విడుదల చేసిన తపాలాబిళ్ళ
పలికే పుస్తకం – మండలి బుద్ధ ప్రసాదు
భారతదేశంలో గ్రంథాలయ శాస్త్ర నైపుణ్యం కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ఇక లేరనే వార్త గ్రంథాలయోద్యమానికి శరాఘాతంలా తగిలింది. తెనాలి అయితానగర్‌లోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకటప్పయ్య తన శేముషీ కృషితో హిమాలయోన్నత శిఖరమంత వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్నారు.
గ్రంథాలయ పాలకుడిగా జీవితాన్ని ప్రారంభించి చివరిరోజువరకూ గ్రంథాల సేకరణ, భద్రతల గురించి, గ్రంథాలయాల అభివృద్ధి గురించీ తపిస్తూ, తెలుగు గ్రంథాలయ బోధనా శాస్త్ర పితామహుడిగా, గ్రంథాలయ శాస్త్రవేత్తగా వెంకటప్పయ్య చిరస్మరణీయుడయ్యారు. మారేపల్లి రామచంద్ర శాసి్త్ర అచ్చ తెలుగులో గ్రంథాలయాన్ని ‘పొత్తములగుడి’ అన్నారు. వెలగావారు ఈ పొత్తముల గుడి ఎదుట ధ్వజస్తంభంలా నిలిచారు. తెనాలిలో ఒక వీధికి ఆయన పేరు పెట్టి ఆంధ్రా ప్యారిస్‌గా ప్రఖ్యాతి వహించిన ఆ నగరం తన ఖ్యాతి నిలుపుకుంది.
నేను ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 ఉగాది పురస్కారంతో సత్కరించింది. కృష్ణా జిల్లా రచయితల సంఘం గత సంవత్సరం వెంకటప్పయ్యగారికి ఆలూరి బైరాగి పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది. ఆ రోజున ఆ పురస్కారం అందించలేకపోతే ఆ అదృష్టం మాకు దక్కకుండా పోయేది.
అఖిల భారత ఆదర్శ పౌర గ్రంథాలయాల చట్టం రూపశిల్పి ఆయన. గ్రంథాలయ శాస్త్ర పాఠ్య గ్రంథాల రచయిత కూడా. తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రల సేకర్త. ఆయన జీవితం, ఆయన మనో ప్రవృత్తి, ఆయన వృత్తీ గ్రంథాలయోద్యమానికి అంకితమైనాయి. తానే ఒక నడిచే గ్రంథాలయంగా వెలుగొందారాయన. బహుశా ఆయన పరిశీలించని, లేదా చూడని తెలుగు గ్రంథం లేదంటే అతిశయోక్తి కాదు. వాజ్ఞ్మయ సూచీకరణ కోసం గ్రంథాలయ పాఠ్య పుస్తకాల రచయితగా ఆయనకు తెలుగులో వెలువడిన ప్రతి పుస్తకం గురించిన పరిజ్ఞానం ఉండేది. విజయవాడలో ఠాగూరు పరిశోధనా కేం ద్రం ఏర్పాటు చేయటం వెనుక ఆయన కృషి. దీక్ష, పట్టుదలల గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆనాడు ఆయన తన ఉద్యోగం, తన జీత భత్యాల గురించి మాత్రమే ఆలోచించి ఉంటే, బహుశా ఠాగూరు పరిశోధనా కేంద్రం మనకు దక్కి ఉండేది కాదు. కృష్ణా జిల్లా గ్రంథాలయాధికారిగా ఆయన పనిచేసిన రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రంథాలయాలలో ఉన్న అనేక అపురూప గ్రంథాలను తెచ్చి ఈ పరిశోధనా కేంద్రంలో మూడు బీరువాలలో భద్రపరిచారు. పుస్తకం విలువ తెలిసిన మనిషి ఆయన. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంత ఎదిగినా పుస్తకానికి మరణం లేదనీ, పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదనీ ఆయన దృఢంగా నమ్మేవారు.
సోవియట్ ఆహ్వానం పైన ఆయన మాస్కో సందర్శించారు. అక్కడ ఆయన చేసిన అధ్యయనం ద్వారా ‘లెనిన్ గ్రంథాలయ విధానం’, ‘లైబ్రరీ-సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్’ గ్రంథాలను ఆయన రాశారు. ఒక కొత్త విషయాన్ని ఆయన అన్వేషించటం, దానిగురించి అపారమైన ఆయన అనుభవాన్ని మేళవిం చి ఒకపుస్తకమో, ఒక వ్యాసమో రాయటం ఆయన నిత్యకృత్యం. ఆయన రాసిన పుస్తకాలన్నీ కలిపి అరవై వేల పేజీలయ్యాయం టే, ఆయన ఎంతటి అధ్యయనపరులో అవగతం అవుతుంది.
సర్వశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, కోదాటి నారాయణరావు, వావిలాల గోపాలకృష్ణయ్య ప్రభుతుల తరువాత ఈ తరంలో మొదటగా కనిపించే పేరు వెలగా వారిది. తనకు ముందుతరం స్వాతంత్రోద్యమాన్నీ, గ్రంథాలయోద్యమాన్నీ కలపి ప్రజా చైతన్య స్ఫూర్తి కోసం ఉద్యమించారు. వెలగావారు గ్రంథాలయోద్యమాన్ని ఆచరణలోకి తెచ్చారు. గ్రంథాలయ ఆదర్శాలకు సంబంధించిన మన ఊహల్ని భూ మార్గం పట్టించారు. వారి నేతృత్వంలో విస్తరించిన భవనాలు, భద్రపరిచిన గ్రంథాలే అందుకు సాక్షి. రేపల్లె, తెనాలి, గుంటూరు, ఒంగోలు, కడప, మచిలీపట్టణంలో గ్రంథాలయ భవనాల నిర్మాణంలో ఆయన పాత్ర గొప్పది. కోదాటి నారాయణరావు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ప్రైవేటు గ్రంథాలయాలకు కూడా ప్రభుత్వ నిధులు అందేలా కృషి చేశారు.
రాజా రామ్మోహన్ గ్రంథాలయ పౌండేషన్, కేంద్ర సాహిత్య అకాడెమీలలో సభ్యుడిగా ఆయన శ్రమ చిరస్మరణీయమైంది. రాష్ట్రంలో ప్రముఖ గ్రంథాలను మైక్రోఫిల్ములు తీయటం, డిజిటలెజేషన్, ఆధునిక పద్ధతుల్లో గ్రంథాలను భద్రపరచటం లాంటి కార్యక్రమాలు అమలుకు వెలగావారి కృషి ఎంతైనా ఉంది.
బాల సాహిత్య రంగంలో కూడా వెలగా వారి కృషి ఉంది. తెలుగు బాలల రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా బాల సాహితీవేత్తలకు ఒక స్ఫూర్తిని కలిగించారు. బాలల అకాడమీలో సభ్యుడిగా ఉన్న కాలంలో ఆయనతో నాకు గల సాన్నిహిత్యం మరువలేనిది. కడపలో పనిచేస్తున్న కాలంలో ఆయన జానపద రంగం మీదకు దృష్టి మళ్ళించారు. దాదాపు మూడు వేల పొడుపు కథలు సేకరించి పుస్తకంగా తెచ్చారు.
ఎక్కడ ఏ చిన్న అచ్చు తప్పు కనిపించినా ఆయన సహించేవారు కాదు. తెలుగు పేర్లను హలంతంగా రాయటాన్ని వ్యతిరేకించేవారు. ప్రసాదు.. ఇలా ‘డు, ము, ఉ’లు చేర్చి రాయాలనే వారు. వైద్యులు, పరిశోధకులకు తమ పేర్ల ముందు డాక్టర్ అని రాయవద్దనీ, డాక్టరు అని స్పష్టంగా రాయమనేవారు. భాషాపరమైన సంస్కరణలంటే వర్ణాలను తగ్గించటం కాదనీ, ఎలాంటి పదాన్నయినా ఉచ్ఛారణకు తగ్గట్టుగా తెలుగులో రాయటానికి కొత్త వర్ణాలను అవసరం అయితే రూపొందించుకోవాలని అనే వారు. ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం పుస్తకాభివృద్ధికి తోడ్పడాలే గానీ, పుస్తకానికి ప్రత్యామ్నాయం కారాదనేది ఆయన సిద్ధాం తం. పనికిరాని పుస్తకాలంటూ ఉండవనీ, అచ్చయిన ప్రతి కాయితంలోనూ ఎంతో కొంత సమాచారం ఉంటుందనీ, దాన్ని గ్రహించగలగాలని ఆయన నమ్మేవారు. వెలగావారి అదృశ్యంతో తెలుగునేల ఒక వెలుగురేఖని కోల్పోయింది. ఒక నడిచే పుస్త కం, ఒక పలికే అక్షరం, ఆత్మీయంగా పిలిచే ఒక పిలుపు అన్నీ మసకబారినట్టు అనిపిస్తోంది. వెలగావారి ఆకాంక్షలను ఆచరణలోకి తేవటం ఒకటే ఆయనకు మనం ఇవ్వగలిగే నివాళి!
మండలి బుద్ధ ప్రసాదు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి
మూలం: ఆంధ్రజ్యోతి
స్ఫూర్తి ప్రదాత వెలగా వెంకటప్పయ్య
నిరాడంబరుడు, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ వెలగా వెంకటప్పయ్య అని వక్తలు కొనియాడారు. గ్రంథాలయ గాంధి, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సంస్మరణ సభ స్థానిక నన్నపనేని సీతారామయ్య, సరస్వతమ్మ కళ్యాణమండపంలో ఆదివారం నిర్వహించారు. సభలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి కెజి శంకర్ మాట్లాడుతూ నిత్యపరిశోధకుడైన వెలగా వెంకటప్పయ్య సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. లాల్ బహుద్దూర్ శాస్త్రీ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ లా ప్రొఫెసర్ డాక్టర్ కె.కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు లభించిన అరుదైన వజ్రం వెలగా అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కళ్ళం హరనాథరెడ్డి మాట్లాడుతూ వెలగా జీవితాన్ని పాఠ్యాంశాలలో చేర్చి ఆయన విగ్రహాన్ని తెనాలిలో ప్రతిష్టించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి వెంకట్రావు మాట్లాడుతూ వెలగా అమూల్యమైన రచనలు చేశారని చెప్పారు. చైతన్యవేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ వెలగా నేటి తరానికి ఆదర్శనీయులన్నారు. అనంతరం డాక్టర్ వెలగా వెంకటప్పయ్యపై రూపొందించిన గ్రంథాన్ని కుటుంబ సభ్యులు సర్వోత్తమరావు, వెంకట్రావు, మానవేంద్ర ఆవిష్కరించారు. అనంతరం వెలగాపై పావులూరి ట్రస్ట్ నిర్మించిన ‘పుస్తక దేవోభవ’ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో పావులూరి శ్రీనివాసరావు, అయ్యంకి మురళీకృష్ణ, లంకా సూర్యనారాయణ, పారి నాయుడు పాల్గొన్నారు.
మూలం: ప్రజాశక్తి