సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని, యువత చెడుమార్గంలో పయనించకుండా ఉండేందుకు పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. స్థానిక వైఎంహెచ్ఎ హాలు వద్ద బాలల గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ సారథి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెలగా వెంకటప్పయ్య నలుగురికి విజ్ఞానాన్ని పంచి ఎందరికో మార్గదర్శకులయ్యారన్నారు. సామాజిక సేవ, త్యాగం ద్వారా ఏదైనా సాధించవచ్చని గాంధీజీ బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయంటే ఇతరులకు చెప్పే ముందు గాంధీజీ ఆచరించి చూపారన్నారు. వెంకటప్పయ్య కష్టపడి పనిచేసి గ్రంథాలయ సంస్థకే వన్నె తీసుకువచ్చారని, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సహనం, ఓపికతో ఆలోచన విధానాన్ని పెంచుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీఆర్‌రెడ్డి కళాశాల లైబ్రేరియన్ ఎల్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటప్పయ్య గ్రంథాలయ ఉద్యమానికి నిరంతరం కష్టపడి పనిచేశారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక చింతనతో పాటు పుస్తకపఠనం కూడా ప్రశాంతతకు మార్గం చూపుతుందన్నారు. అభివృద్ధి సాధించడానికి చదువుపై సంకల్పం దీక్ష తప్పనిసరి అన్నారు. తాను చదువుకుంటున్న రోజుల్లో విద్యకే ప్రాధాన్యం ఇచ్చి ఎంతో కష్టించి చదువుకున్నానని, అందుకే ఈరోజు కమిషనర్ స్థాయికి ఎదిగానన్నారు. డెప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిశోర్, లైబ్రేరియన్ ఉదయశంకర్, చెన్నా వెంకట్రామయ్య పాల్గొన్నారు.
మూలం:వెబ్ ఏలూరు.కామ్