స్ఫూర్తి ప్రదాత వెలగా వెంకటప్పయ్య

నిరాడంబరుడు, స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య అని వక్తలు కొనియాడారు. గ్రంథాలయ గాంధి, డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య సంస్మరణ సభ స్థానిక నన్నపనేని సీతారామయ్య, సరస్వతమ్మ కళ్యాణమండపంలో ఆదివారం నిర్వహించారు. సభలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి కెజి శంకర్‌ మాట్లాడుతూ నిత్యపరిశోధకుడైన వెలగా వెంకటప్పయ్య సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. లాల్‌ బహుద్దూర్‌ శాస్త్రీ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ లా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు లభించిన అరుదైన వజ్రం వెలగా అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కళ్ళం హరనాథరెడ్డి మాట్లాడుతూ వెలగా జీవితాన్ని పాఠ్యాంశాలలో చేర్చి ఆయన విగ్రహాన్ని తెనాలిలో ప్రతిష్టించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి వెంకట్రావు మాట్లాడుతూ వెలగా అమూల్యమైన రచనలు చేశారని చెప్పారు. చైతన్యవేదిక అధ్యక్షులు డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ వెలగా నేటి తరానికి ఆదర్శనీయులన్నారు. అనంతరం డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యపై రూపొందించిన గ్రంథాన్ని కుటుంబ సభ్యులు సర్వోత్తమరావు, వెంకట్రావు, మానవేంద్ర ఆవిష్కరించారు. అనంతరం వెలగాపై పావులూరి ట్రస్ట్‌ నిర్మించిన ‘పుస్తక దేవోభవ’ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో పావులూరి శ్రీనివాసరావు, అయ్యంకి మురళీకృష్ణ, లంకా సూర్యనారాయణ, పారి నాయుడు పాల్గొన్నారు.

మూలం: ప్రజాశక్తి